పాలమూరు ప్రాజెక్టు వివరాలన్నీ ఇవ్వండి

  • ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి అన్ని వివరాలను సీల్డ్‌ కవర్‌లో అందించాలని రాష్ట్ర సర్కార్, బీహెచ్‌ఈఎల్‌ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పేరుతో గత బీఆర్ఎస్  ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని, దీనిపై విచారణకు ఆదేశించాలని కోరుతూ నాగం జనార్దన్ రెడ్డి 2019 మార్చి 5న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ ప్రాజెక్ట్ పేరుతో గత ప్రభుత్వం సుమారు రూ.35 వేల కోట్ల అవినీతికి పాల్పడిందని, ఇది తెలంగాణలోనే అతిపెద్ద స్కామ్ అని అందులో పేర్కొన్నారు. దీనిపై విచారించిన సుప్రీం.. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలన్నీ అందించాలని రాష్ట్ర సర్కార్, బీహెచ్‌ఈఎల్​ను ఆదేశించింది.